AP 6 Science

AP 6th Class Science Important Questions Chapter 12 కదలిక – చలనం

AP 6th Class Science Important Questions Chapter 12 కదలిక – చలనం

AP Board 6th Class Science 12th Lesson Important Questions and Answers కదలిక – చలనం

6th Class Science 12th Lesson 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
కదలిక అంటే ఏమిటి?
జవాబు:
ఒక జీవి యొక్క శరీరం లేదా దాని భాగాలు యథాస్థానం నుండి శాశ్వతంగా గాని లేదా తాత్కాలికంగా గాని మారే ప్రక్రియను కదలిక అంటారు.

ప్రశ్న 2.
స్థాన చలనం అంటే ఏమిటి?
జవాబు:
మొత్తం శరీరం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారే ప్రక్రియను స్థాన చలనం అంటారు.

ప్రశ్న 3.
స్థాన చలనం అవసరం ఏమిటి?
జవాబు:
స్థాన చలనం రక్షణ మరియు ఆహార సేకరణకు సహాయపడుతుంది.

ప్రశ్న 4.
కండరాలు ఎముకలతో ఎలా అనుసంధానించబడి ఉన్నాయి?
జవాబు:
కండరాలు ఎముకలతో నేరుగా కాకుండా స్నాయు బంధనం లేదా టెండాన్ సహాయంతో అనుసంధానించబడి ఉంటాయి.

 

ప్రశ్న 5.
కండరాలు ఎలా పనిచేస్తాయి?
జవాబు:
కండరాలు జంటగా పనిచేస్తాయి. వాటిలో ఒకటి సంకోచించినప్పుడు, ఎముక ఆ దిశగా లాగబడుతుంది. అప్పుడు జతలోని మరొక కండరం సడలించబడుతుంది.

ప్రశ్న 6.
అస్థిపంజరం అంటే ఏమిటి?
జవాబు:
మన శరీరంలోని వివిధ ఎముకలు కలిసి అస్థిపంజరంగా ఏర్పడతాయి. ఇది శరీరానికి ఆధారాన్ని ఇస్తుంది.

ప్రశ్న 7.
కీలు అంటే ఏమిటి?
జవాబు:
రెండు ఎముకలు కలిసే ప్రాంతాన్ని కీలు అంటారు.

ప్రశ్న 8.
కీళ్ళలోని రకాలు ఏమిటి?
జవాబు:
కీళ్ళు రెండు రకాలు. అవి కదిలే కీళ్ళు మరియు కదలని కీళ్ళు.

ప్రశ్న 9.
కదిలే కీళ్ళలో రకాలు ఏమిటి?
జవాబు:
కదిలే కీళ్ళు నాలుగు రకాలు. అవి

  1. బంతి గిన్నె కీలు,
  2. మడత బందు కీలు,
  3. జారెడు కీలు,
  4. బొంగరపు కీలు.

ప్రశ్న 10.
స్నాయుబంధనం (టెండాన్) ఉపయోగం ఏమిటి?
జవాబు:
స్నాయుబంధనం ఎముకలను, కండరాలను కలుపుతుంది.

ప్రశ్న 11.
సంధి బంధనం (లిగమెంట్) యొక్క పని ఏమిటి?
జవాబు:
సంధి బంధనం ఒక ఎముకను మరొక ఎముకతో కలుపుతుంది.

ప్రశ్న 12.
మన శరీరంలో కదలని కీళ్ళు ఎక్కడ ఉంటాయి?
జవాబు:
ఎగువ దవడ మరియు పుర్రె మధ్య కదలని కీళ్ళు ఉంటాయి.

 

ప్రశ్న 13.
జీవులలో గల కొన్ని చలన అవయవాలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
చేపలలో – వాజాలు
పక్షులలో – కాళ్ళు, రెక్కలు
పాములో – పక్కటెముకలు
నత్తలో – కండరపాదం చలనానికి ఉపయోగపడతాయి.

ప్రశ్న 14.
మన శరీరంలో ఎన్ని కండరాలు ఉన్నాయి?
జవాబు:
మన శరీరంలో 650 కన్నా ఎక్కువ కండరాలు ఉన్నాయి.

ప్రశ్న 15.
మన శరీరంలో అతి పెద్ద కండరం ఏమిటి?
జవాబు:
మన శరీరంలో అతి పెద్ద కండరం గ్లూటియస్ మాక్షిమస్.

ప్రశ్న 16.
మన శరీరంలో అతి చిన్న కండరం ఏమిటి?
జవాబు:
మన శరీరంలో అతి చిన్న కండరం స్టేపిడియస్.

ప్రశ్న 17.
విశ్రాంతి లేకుండా ఏ కండరాలు పనిచేస్తాయి?
జవాబు:
గుండె కండరాలు విశ్రాంతి లేకుండా పనిచేస్తాయి.

ప్రశ్న 18.
నిమిషానికి హృదయం ఎంత రక్తం పంపు చేస్తుంది?
జవాబు:
మానవ హృదయం రక్త నాళాల ద్వారా నిమిషానికి 4500 సిసి రక్తాన్ని పంపు చేస్తుంది.

ప్రశ్న 19.
పుర్రెలో గల కదిలే కీలు ఏమిటి?
జవాబు:
పుర్రెలో గల కదిలే కీలు క్రింది దవడ.

ప్రశ్న 20.
మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి?
జవాబు:
మానవ శరీరంలో 206 ఎముకలు ఉన్నాయి.

ప్రశ్న 21.
ఎముకలు ఎలా తయారవుతాయి?
జవాబు:
ఎముకలు కాల్షియం మరియు భాస్వరంతో తయారవుతాయి. ఇవి చాలా కఠినంగా ఉంటాయి.

ప్రశ్న 22.
మన శరీరంలో అతిపెద్ద ఎముక ఏమిటి?
జవాబు:
తొడ ఎముక (ఫీమర్) మన శరీరంలో అతి పెద్ద ఎముక.

ప్రశ్న 23.
మన శరీరంలో అతి చిన్న ఎముక ఏమిటి?
జవాబు:
చిన్న ఎముక స్టేపిస్ లేదా కర్ణాంతరాస్థి.

 

ప్రశ్న 24.
మనం పై దవడను ఎందుకు కదిలించలేము?
జవాబు:
మన శరీరంలో ఎముకల మధ్య ఉండే కొన్ని కీళ్ళు కదలవు. వీటిని ‘కదలని కీళ్ళు’ అంటారు. పుర్రె భాగంలో గల పై దవడకు, తలకు మధ్య కదలని కీలు ఉంటుంది. అందువల్లనే మనం పై దవడను కదిలించలేము.

6th Class Science 12th Lesson 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
కండరాలు కదలకుండా మీ శరీర భాగాలను కదిలించటం సాధ్యమేనా? ఎందుకు?
జవాబు:

  1. కండరాలు కదలకుండా శరీర భాగాలను కదిలించడం సాధ్యం కాదు.
  2. కండరాలు మాంసయుత నిర్మాణాలు. అవి కదలికకు కారణమవుతాయి.
  3. ఇవి ఎముకలకు జతచేయబడి సంకోచం మరియు సడలింపును చేస్తాయి.
  4. ఈ సంకోచాల ద్వారా ఎముకలు ఆ దిశలో లాగబడి కదలికను కలిగిస్తాయి.

ప్రశ్న 2.
కండరాలు ఎలా పనిచేస్తాయి?
జవాబు:

  1. కండరాలు జంటగా పనిచేస్తాయి.
  2. వాటిలో ఒకటి సంకోచించినప్పుడు, ఎముక ఆ దిశగా లాగబడుతుంది మరియు జతలోని మరో కండరం అప్పుడు సడలించబడుతుంది.
  3. ఎముకను వ్యతిరేక దిశలో కదిలించడానికి రెండవ కండరం సంకోచించబడి, మొదటి కండరం సడలించ బడుతుంది. ఎముకను కదిలించడానికి రెండు కండరాలు కలిసి పనిచేయాలి.

ప్రశ్న 3.
టెండాన్ అంటే ఏమిటి? మన శరీరంలో దాని పాత్ర ఏమిటి?
జవాబు:
కొన్ని కండరాలకు గుండ్రంగా, తెల్లగా ఉండే దారాల వంటి తంతువులు ఉంటాయి. వాటి చివరలు ఎముకకు అతికి ఉంటాయి.

  • ఈ తంతుయుత నిర్మాణాన్ని స్నాయుబంధనం లేదా టెండాన్ అంటారు.
  • మన శరీరంలోని అనేక భాగాలలో స్నాయువులను గమనించవచ్చు.
  • మోచేయి పైన, మోకాలి క్రింద, చీలమండ దగ్గర ఇవి కనిపిస్తాయి.
  • ఎముకలను కదిలించటానికి, శరీర కదలికలలో వీటికి కీలకపాత్ర ఉంటుంది.
  • కండరాలు ఎముకలకు అంటిపెట్టుకోవటానికి ఇవి ఉపయోగపడతాయి.

ప్రశ్న 4.
అస్థి పంజరం అంటే ఏమిటి? ఇది ఎందుకు ముఖ్యమైనది?
జవాబు:

  1. శరీరంలోని వివిధ ఎముకలు కలిసి ఒక నిర్మాణం లేదా వ్యవస్థను ఏర్పరుస్తాయి. ఈ నిర్మాణాన్ని అస్థిపంజరం అంటారు.
  2. అస్థిపంజరం మన శరీరానికి ఆధారము మరియు ఆకారాన్ని అందిస్తుంది.
  3. ఇది అంతర్గత అవయవాలకు రక్షణ కల్పిస్తుంది.
  4. రక్తం ఏర్పడటానికి కూడా సహాయపడుతుంది.

ప్రశ్న 5.
లిగమెంట్ అంటే ఏమిటి? దాని ఉపయోగం ఏమిటి?
జవాబు:
పొడవైన కండర తంతువుల ద్వారా రెండు ఎముకలు ఒక ప్రత్యేక ప్రాంతంలో కలుస్తాయి. ఈ కండర తంతువులను లిగమెంట్లు లేదా సంధిబంధనాలు అంటారు. ఇవి ఎముకలను కలపటానికి మరియు శరీర కదలికలకు సహాయపడతాయి.

 

ప్రశ్న 6.
అస్థిపంజరము లేకుంటే మనం ఎలా ఉంటాము?
జవాబు:

  1. అస్థిపంజరం లేకుండా మనశరీరాన్ని ఊహించుకోవడం తమాషాగా అనిపిస్తుంది.
  2. అస్థిపంజరం లేకుంటే కండరాలకు ఆధారం ఉండరు.
  3. అందువలన శరీరానికి ఆకారం ఉం
  4. శరీరం మొత్తం గుండ్రని బంతిలా అవుతుంది.

ప్రశ్న 7.
జత్రుక అంటే ఏమిటి? దీని ఉపయోగం ఏమిటి?
జవాబు:

  1. జత్రుక అనేది మెడ మరియు భుజం మధ్య ఉండే పొడవైన ఎముక. దీనిని కాలర్ బోన్ అని కూడా పిలుస్తారు.
  2. ఇది భుజానికి గొప్ప ఆధారాన్ని అందిస్తుంది మరియు బరువైన వస్తువులను తీసుకువెళ్ళడానికి సహాయపడుతుంది.

ప్రశ్న 8.
మీరు జత్రుకను ఎలా పరిశీలిస్తారు?
జవాబు:
ఒక చేతిని మడిచి నడుము దగ్గర ఉంచాలి. ఇప్పుడు మెల్లగా భుజంతో బాటు చేతిని పైకి లేపాలి. మరో చేతి వేలితో మెడ నుండి భుజం వరకు జరపాలి. అక్కడ ఉన్న ఎముకలను కనుక్కోవడానికి ప్రయత్నించాలి. భుజం నుంచి మెడ వరకు రెండు ఎముకలు ఉంటాయి. పైకి కనిపించే ఎముకను గుర్తించడానికి ప్రయత్నించాలి. దానిని జత్రుక అంటారు. దాని వెనుకవైపు ఉండే ఎముకను రెక్క ఎముక (Shoulder – blade) అంటారు. ఈ రెండింటిని కలిపి భుజాస్టులు అంటారు.

ప్రశ్న 9.
పక్కటెముకలు మరియు ఉరఃపంజరం మధ్య గల తేడా ఏమిటి?
జవాబు:

పక్కటెముకలు ఉరఃపంజరం
1) ఛాతీ కుహరంలోని ఎముకలు పక్కటెముకలు. 1) పక్కటెముకలు కలిసి ఉరఃపంజరం ఏర్పరుస్తాయి.
2) ఇవి 12 జతలు. 2) దీని సంఖ్య ఒకటి.
3) ఇవి ముందు వైపు ఛాతీ ఎముకకు మరియు వెనుక వెన్నెముకకు అనుసంధానించబడి ఉంటాయి. 3) ఛాతీ ఎముక, పక్కటెముకలు మరియు వెన్నెముక అన్నీ కలిసి ఉరఃపంజరంను ఏర్పరుస్తాయి.
4) శ్వాసకోశ కదలికలు మరియు రక్షణలో సహాయపడతాయి… 4) ఇది ఊపిరితిత్తులు మరియు గుండెను రక్షిస్తుంది.

ప్రశ్న 10.
పుర్రె గురించి వ్రాయండి.
జవాబు:

  1. పుర్రె అనేక ఎముకలతో కలిసి ఉంటుంది.
  2. ఇది మెదడును చుట్టి రక్షిస్తుంది.
  3. పుర్రె ఎముకల మధ్య కీళ్ళు కలిసిపోతాయి.
  4. వీటిని స్థిర కీళ్ళు అని కూడా అంటారు.

ప్రశ్న 11.
మృదులాస్థి అంటే ఏమిటి? ఇది శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు:

  1. చెవి మరియు ముక్కు యొక్క కొన్ని భాగాలు మృదువుగా ఉంటాయి. మరికొన్ని గట్టిగా ఉంటాయి.
  2. వీటిలో గట్టి భాగాలు మృదులాస్థి అనే నిర్మాణంతో తయారవుతాయి.
  3. ఇది కూడా ఎముకే అయితే ఇది మృదువైనది.
  4. మృదులాస్థి అస్థిపంజరం యొక్క ఇతర భాగాలలో కూడా ఉంటుంది. ఉదా : పక్కటెముక చివర, కనురెప్పలు, రొమ్ము ఎముక, వెన్నెముక యొక్క వెన్నుపూసల మధ్య మృదులాస్థి ఉంటుంది.
  5. ఇది కీళ్ళ వద్ద పొడవైన ఎముకల చివరలను రక్షిస్తుంది.

 

ప్రశ్న 12.
కీలు అంటే ఏమిటి? దానిలోని రకాలు ఏమిటి?
జవాబు:

  1. రెండు ఎముకలు కలిసే ప్రదేశాన్ని కీలు అంటారు.
  2. కీళ్ళు వంగడానికి, కదలటానికి మరియు చలనానికి సహాయపడతాయి.
  3. వేర్వేరు కదలికలు మరియు కార్యకలాపాలను నిర్వహించడానికి మన శరీరంలో వివిధ రకాల కీళ్ళు ఉన్నాయి.
  4. కీళ్ళు రెండు రకాలుగా విభజించబడ్డాయి. 1) కదిలే కీళ్ళు, 2) కదలని (స్థిరమైన) కీళ్ళు,

ప్రశ్న 13.
కదిలే కీళ్ళు రకాలు ఏమిటి?
జవాబు:
కదిలే కీళ్ళు నాలుగు రకాలుగా విభజించబడ్డాయి. అవి

  1. బంతి గిన్నె కీలు,
  2. మడత బందు కీలు,
  3. జారెడు కీలు,
  4. బొంగరపు కీలు.

ప్రశ్న 14.
కదలని కీళ్ళు గురించి వ్రాయండి.
జవాబు:

  1. మన శరీరంలోని ఎముకల మధ్య కొన్ని కీళ్ళు కదలలేవు. ఇటువంటి కీళ్ళను కదలని కీళ్ళు అంటారు.
  2. ఈ కీళ్ళు కలిసిపోయి ఒకే ఎముకలా కనిపిస్తాయి.
  3. ఇవి పుర్రెలో ఉంటాయి. మనం నోరు తెరచినప్పుడు, మన క్రింది దవడను మాత్రమే కదిలించగలము.
  4. పై దవడ కదలని కీలు.

ప్రశ్న 15.
చేపలు నీటిలో ఎలా ఈదగలుగుతున్నాయి?
జవాబు:

  1. చేపల శరీరం పడవ ఆకారంలో ఉంటుంది.
  2. ఇది చేపలు నీటిలో తేలికగా కదలడానికి వీలు కల్పిస్తుంది.
  3. చేపల అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పబడి ఉంటుంది.
  4. పొలుసుల చర్మం మరియు వాజాల సహాయంతో చేప నీటిలో ఈదగలుగుతుంది.

ప్రశ్న 16.
పక్షులలో చలనం గురించి వ్రాయండి.
జవాబు:

  1. పక్షులు గాలిలో ఎగురుతాయి మరియు నేలమీద నడుస్తాయి.
  2. పక్షులు ఎగరటానికి వీలుగా ప్రత్యేక శరీర నిర్మాణం కలిగి ఉంటాయి.
  3. వాటి ఎముకలు బోలుగా మరియు తేలికగా ఉంటాయి.
  4. కాలి ఎముకలు నడవడానికి మరియు గెంతటానికి అనువుగా ఉంటాయి.
  5. ముందరి చేతులు రెక్కలుగా మారి పక్షికి ఎగరటానికి సహాయపడతాయి.
  6. ఈ ఎగిరే ప్రక్రియలో ఈకలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

ప్రశ్న 17.
కోడి, పిచ్చుకలను గమనించండి. అవి ఎలా చలిస్తాయి?
జవాబు:
కోడి మరియు పిచ్చుకలు రెండూ పక్షులే కాని వాటి చలనాలు భిన్నంగా ఉంటాయి.

కోడి పిచ్చుక
1) ఇది గాలిలో ఎగురలేదు 1) ఇది గాలిలో ఎగురుతుంది.
2) నడవటం దీని ప్రధాన చలనం 2) ఇది ఎగరటం మరియు నేలపై దుమకటం చేస్తుంది.
3) బలమైన కాళ్ళు ఉంటాయి. 3) కాళ్ళు సన్నగా మరియు బలహీనంగా ఉంటాయి.
4) శరీరం గాఖలయిలో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉండదు. 4) శరీరం గాలిలో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటుంది.
5) ఎముకలు గట్టిగా, బలంగా ఉంటాయి. 5) ఎముకలు తేలికగా, బోలుగా ఉంటాయి.

ప్రశ్న 18.
పాములోని చలనం వివరించండి.
జవాబు:

  1. పాములకు చలనాంగాలు (కాళ్ళు) లేవు.
  2. పాములకు పొడవాటి వెన్నెముక మరియు అనేక కండరాలు ఉంటాయి.
  3. సాధారణంగా పాము యొక్క శరీరం పొడవుగా ఉండి మెలి తిరుగుతుంది.
  4. పాము యొక్క ప్రతి వంపు భూమిపై ఒత్తిడి కలిగించి, శరీరాన్ని ముందుకు తోస్తుంది.
  5. పాము చాలా వేగంగా ముందుకు సాగడానికి పొట్ట క్రింద ఉండే పొలుసులు కూడా సహాయపడతాయి.

 

ప్రశ్న 19.
నత్త స్థాన చలనంను వివరించండి.
జవాబు:

  1. నత్తగుల్ల (కర్పరం) నుండి మందపాటి కండర నిర్మాణం బయటకు వస్తుంది.
  2. ఈ మందపాటి నిర్మాణం దాని పాదం. ఇది బలమైన కండరాలతో తయారు చేయబడి ఉంటుంది.
  3. దాని పాదం యొక్క అలల వంటి కదలిక వలన నత్త నెమ్మదిగా కదులుతుంది.

6th Class Science 12th Lesson 8 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
పాములో ఇతర చలన మార్గాలు చాలా ఉన్నాయి. వారి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ చిత్రాలను సేకరించండి. సమాచారం మరియు వాటిని గోడ పత్రికలో ప్రదర్శించండి.
జవాబు:
పాములు నాలుగు విధాలుగా చలిస్తాయి. వాటికి కాళ్ళు లేనందున అవి చలించటానికి కండరాలను మరియు పొలుసులను ఉపయోగిస్తాయి.

సర్పంటైన్ పద్ధతి :
పాముల గురించి ఆలోచించినప్పుడు ఈ చలనం చాలా మందికి వెంటనే గుర్తుకొస్తుంది. పాములు ఏదైనా నేల వంటి ఉపరితలం, రాళ్ళు, చెట్లు మొదలైన ప్రాంతాలలో ఈ పద్ధతి వాడతాయి. ఈ పద్దతిలో ఇవి అలల వలె కదులుతాయి. ఇవి గాజు వంటి మృదువైన ఉపరితలాలపై కదలలేవు. ఈ కదలికను పార్శ్వ కదలిక అని కూడా అంటారు.

కాన్సర్టినా పద్దతి :
పాము అత్యవసర పరిస్థితులలో కదలడానికి ఈ పద్ధతిని వాడుతుంది. ఇది చాలా కష్టమైన మార్గాలలో కాని, గట్టి ప్రదేశాలలో కాని ప్రభావవంతంగా ఉంటుంది. ఈ ప్రక్రియలో ముందు భాగాన్ని పైకి లేపి దుముకుతూ నేలను తక్కువ తాకుతూ త్వరగా ప్రయాణిస్తుంది.

సైడ్ వైండింగ్ :
ఇది వివరించడానికి చాలా కష్టమైన కదలిక. అయితే ఇసుక లేదా బురద వంటి వదులుగా లేదా జారే ఉపరితలాలపై కదలడానికి పాములు దీనిని తరచుగా ఉపయోగిస్తాయి. పాము తన తలని ముందుకు విసిరినట్లు కనిపిస్తుంది మరియు శరీరాన్ని బాగా వంచి అంచుల ప్రాంతం నేలను తాకటం వలన పాము పక్కకు ప్రయాణిస్తుంది. ఇది ప్రధానంగా ఎడారి ప్రాంతాలకు అనుకూలం.

రెక్టలినియర్ విధానం :
ఇది నెమ్మదిగా, గగుర్పాటుగా, నేరుగా ఉండే కదలిక పాము తన పొట్టపై ఉన్న కొన్ని పొలుసులను ఉపయోగించి ఆధారాన్ని పట్టుకొని ప్రయాణిస్తుంది.

ప్రశ్న 2.
మానవులలో కదిలే కీళ్ళు గురించి వ్రాయండి.
జవాబు:
కదిలే కీళ్ళు నాలుగు రకాలు.
1) బంతి గిన్నె కీలు :
ఒక ఎముక యొక్క బంతి వంటి ఆకారం మరొక ఎముకలోని గిన్నె లాంటి ఆకారంలోకి ఇమిడిపోతుంది. బంతి గిన్నె కీలుకు ఉదాహరణలు తుంటి మరియు భుజం.

2) మడత బందు కీలు :
తలుపు మడత బందు వలె ఎముకలను ఒకే దిశలో కదిలించటానికి తోడ్పడే కీలును మడత బందు కీలు అంటారు. ఉదాహరణలు మోకాళ్ళు మరియు మోచేతులు.

3) బొంగరపు కీలు :
పుర్రెను వెన్నెముకతో కలిపే కీలుని బొంగరపు లేదా మెడ కీలు అంటారు. ఇది గుండ్రని చలనాన్ని ప్రదర్శిస్తుంది.

4) జారెడు కీలు :
ఇది జారుడు కదలికను మాత్రమే అనుమతించే కీలు. జారెడు కీలు ఒక ఎముక మరొకదానిపైన జారడానికి అనుమతిస్తుంది. జారెడు కీలు మన మణికట్టును వంచుటకు అనుమతిస్తుంది. ఇది చాలా చిన్న ప్రక్క ప్రక్క కదలికలను చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మన శరీరంలోని చీలమండలు మరియు మణికట్టులలో జారెడు కీళ్ళు ఉన్నాయి.

ప్రశ్న 3.
నీటిలో చేప ఎలా ఈదుతుంది?
జవాబు:

  1. చేపల శరీరం పడవ ఆకారంలో ఉంటుంది.
  2. ఈ ఆకారం వలన నీటిలో తేలికగా కదలడానికి వీలుగా ఉంటుంది.
  3. చేపల అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పబడి ఉంటుంది.
  4. ఈత కొట్టేటప్పుడు, శరీరం యొక్క ముందు భాగం కండరాలు ఒకవైపు వైపుకు కదిలితే, తోక దానికి వ్యతిరేకదిశలో కదులుతుంది.
  5. ఇది ఒక కుదుపును సృష్టిస్తుంది మరియు శరీరాన్ని ముందుకు నెడుతుంది.
  6. ఇలాంటి కుదుపుల వరుస చేపను ముందుకు నెడుతుంది.
  7. తోక మరియు వాజములు కూడా ఈ కదలికకు సహాయపడతాయి.

 

ప్రశ్న 4.
వివిధ జీవులలో చలనాన్ని, వాటి చలనాంగాలను పట్టిక రూపంలో వ్రాయండి.
జవాబు:
ఆ చలనం – జీవి – చలనాంగము – వివరణ ఈదటం చేప వాజములు చేప ఈదటంలో రెక్కల వంటి వాజములు, పడవ వంటి ఆకారం ఉపయోగపడును. 2. పాకటం పాము పొలుసులు పొట్టక్రింద ఉండే పొలుసులు పాకేటప్పుడు పట్టు కలిగిస్తాయి. 3 ఎగరటం పక్షులు ఈకలతో కూడిన రెక్కలు పక్షులలో ఎగరటానికి తోడ్పడును. నడవటం మానవుడు | కాళ్ళు జతకాళ్ళు మనిషికి నడవటానికి, పరిగెత్తటానికి తోడ్పడును. రెక్కలు

AP Board 6th Class Science 12th Lesson 1 Mark Bits Questions and Answers కదలిక – చలనం

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. కింది వాటిలో ఏది కాళ్ళు లేనప్పటికి స్థాన చలనం చూపిస్తుంది.
A) కప్ప
B) పాము
C) మనిషి
D) కాకి
జవాబు:
B) పాము

2. ఏవి నడవగల మరియు ఎగరగల జీవులు?
A) చేప
B) కప్ప
C) పక్షులు
D) పులి
జవాబు:
C) పక్షులు

3. చీలమండలో ఉండే కీళ్ళు
A) బొంగరపు
B) బంతిగిన్నె
C) జారెడు కీలు
D) మడత బందు కీలు
జవాబు:
C) జారెడు కీలు

4. మృదువైన ఎముక ఉన్న భాగాలు
A) పుర్రె
B) ముక్కు కొన
C) జత్రుక
D) ఎముక
జవాబు:
B) ముక్కు కొన

 

5. పక్కటెముక దేనిని రక్షిస్తుంది?
A) కడుపు
B) గుండె
C) ఊపిరితిత్తులు
D) బి & సి
జవాబు:
D) బి & సి

6. వెన్నెముక వేటి కలయిక వలన ఏర్పడును?
A) వెన్నుపూస
B) చిన్న ఎముకలు
C) రక్తం
D) లోహాలు
జవాబు:
A) వెన్నుపూస

II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.

1. …………. ఎముకలను కండరాలను కలుపుతుంది.
2. ……………. ఒక ఎముకను మరొక ఎముకతో కలుపుతుంది.
3. రెండు ఎముకలు కలిసే ప్రాంతాన్ని …………. అంటారు.
4. మన శరీరంలోని వివిధ ఎముకలు కలిపి …………. ను ఏర్పరచుతాయి.
5. ……………. జతలుగా పనిచేస్తాయి.
6. మొక్కలు …….. చూపిస్తాయి.
7. కండరాలు …………….కు అతికి ఉంటాయి.
8…………….. లో మొత్తం శరీరం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారుతుంది.
9. భుజాలు ……………. కీళ్ళు కలిగి ఉంటాయి.
10. మన శరీరంలోని మొత్తం కండరాలు ………….
11. తల యొక్క వివిధ ఎముకలు కలిపి ఒక ………….. అంటారు.
12. ……………. మన తలలో కదిలే ఎముక.
13. వెన్నెముక …………….. తో నిర్మితమౌతుంది.
14. స్థిరమైన కీళ్ళు ……………. లో ఉన్నాయి.
15. మోచేతులు మరియు మోకాళ్ళలో ……….. కాని చలనాన్ని కాదు. కీళ్ళు ఉంటాయి.
16. నత్తలోని చలన అవయవం …………
17. …………… కీలు ఎక్కువ బరువును భరించడానికి సహాయపడుతుంది.
జవాబు:

  1. స్నాయువు
  2. సంధిబంధనం (లిగమెంట్)
  3. కీలు
  4. అస్థిపంజరం
  5. కండరాలు
  6. కదలికలను
  7. ఎముకలకు
  8. చలనం
  9. బంతి గిన్నె
  10. 650
  11. పుర్రె
  12. క్రింది దవడ
  13. వెన్నుపూసల
  14. పుర్రె
  15. మడత బందు
  16. పాదము
  17. బొంగరపు

III. జతపరచుట

కింది వానిని జతపరచుము.

1.

Group – A Group – B
ఎ) మడత బందు కీలు 1. మెడ
బి) బొంగరపు కీలు 2. భుజం
సి) బంతి గిన్నె కీలు 3. వెన్నెముక
డి) జారెడు కీలు 4. మోకాలు

జవాబు:

Group – A Group – B
ఎ) మడత బందు కీలు 4. మోకాలు
బి) బొంగరపు కీలు 1. మెడ
సి) బంతి గిన్నె కీలు 2. భుజం
డి) జారెడు కీలు 3. వెన్నెముక

2.

Group – A Group – B
ఎ) చేప 1. పాదం
బి) పాము 2. వాజములు
సి) పక్షి 3. పొలుసులు
డి) నత్త ) 4. రెక్కలు

జవాబు:

Group – A Group – B
ఎ) చేప 2. వాజములు
బి) పాము 3. పొలుసులు
సి) పక్షి ) 4. రెక్కలు
డి) నత్త 1. పాదం

3.

Group – A Group – B
ఎ) కీలు 1. పుర్రె
బి) టెండాన్ 2. ఎముకల కీళ్ళు
సి) లిగమెంట్ 3. ఎముక నుండి కండరానికి
డి) స్థిర కీలు 4. ఎముకల సంధి తలం

జవాబు:

Group – A Group – B
ఎ) కీలు 4. ఎముకల సంధి తలం
బి) టెండాన్ 3. ఎముక నుండి కండరానికి
సి) లిగమెంట్ 2. ఎముకల కీళ్ళు
డి) స్థిర కీలు 1. పుర్రె

మీకు తెలుసా?

మన శరీరంలో 650 కంటే ఎక్కువ కండరాలు ఉంటాయి. అతి పెద్ద కండరం గ్లూటియస్ – మాక్షిమస్. అతి చిన్న కండరం స్టేపిడియస్. గుండె కండరాలు విశ్రాంతి లేకుండా పనిచేస్తాయి. మానవ హృదయం రక్తనాళాల ద్వారా నిమిషానికి 4500 సిసి రక్తాన్ని సరఫరా చేస్తుంది.

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *